దేవదాసుకు చెప్పు దెబ్బలు ?

పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదిన యువతి హైదరాబాద్: వెంటపడి వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఓ యువతి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసుల ముందే చితక్కొట్టింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ముషీరాబాద్‌లో నివసించే మల్లీశ్వరి (34) బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని సాగర్ సొసైటీలో ఉద్యోగం చేస్తోంది. 

అదే ప్రాంతానికి చెందిన దేవదాసు (38) అనే కార్పెంటర్ వారం రోజుల నుంచి యువతి ఎక్కిన బస్సులోనే వెళ్తూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో బాధిత యువతి ఈ వేధింపుల వ్యవహారాన్ని సోదరుడి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం ఉదయం సోదరుడు, వదినను తీసుకొని ఎప్పటిలాగే బస్సులో బంజారాహిల్స్‌కు వచ్చి సాగర్ సొసైటీ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రోజులాగే దేవదాసు కూడా ఆమెను వెంబడించాడు. దీంతో అందరూ కలసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. 

పోలీసుల ముందే ఆ యువతి... ఈవ్‌టీజర్‌ను చెప్పుతో కొట్టింది. కాగా, దేవదాసుపై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.


People Like Too Much